ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) (Gaddar) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.

గద్దర్‌ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స  చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది.

గద్దర్‌ మరణంతో సికింద్రాబాద్‌ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భూదేవి నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌.. పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు.

గద్దర్‌ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావ్‌. నిజామాబాద్‌, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు (సూర్యుడు, చంద్రుడు, వెన్నెల). జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మాభూమి’ సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్‌ ఆయనకు ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా..’ పాటకు నంది అవార్డు లభించింది. అయితే, ఆ అవార్డును తిరస్కరించారు.

Join WhatsApp Channel