Sitaram Yechury: కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి మృతి

Photo of author

Eevela_Team

Share this Article

కమ్యూనిస్ట్ అగ్రనేత, ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆయన 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు.

చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో12 ఆగస్టు 1952న సీతారాం ఏచూరి జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ మోహన్‌ కందాకు ఈయన మేనల్లుడు. ఏచూరి హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1969 లోని తెలంగాణా ఉద్యమ కాలంలో దిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు.తన మాస్టర్స్ కోసం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కంటే కొత్తగా స్థాపించబడిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుని అక్కడే ఆయన ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. JNUలో ఉన్నకాలంలో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. అటు తర్వాత ప్రకాష్ కారత్‌తో కలిసి JNUని అజేయమైన వామపక్ష కోటగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు.

సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిలో ఆయన కూడా ఒకరు. ఆయన ఎన్నడూ పార్టీ జిల్లా లేదా రాష్ట్ర శాఖకు నాయకత్వం వహించలేదు. అయినప్పటికీ, అతను 32 ఏళ్ళకు కేంద్ర కమిటీ మరియు 40 ఏళ్ళకు పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యాడు.1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్నకాలంలో ఆయన ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై తనదైన శైలిలో అంశాలను లేవనెత్తి మంచి గుర్తింపు పొందారు. ఆయన పదునైన రాజకీయ ప్రసంగాలు హాస్యం మరియు చమత్కారంతో కూడి ఉండేవి.1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంతోపాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. ఆయన రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఆంగ్లపత్రికకు కాలమ్స్‌ రాశారు. ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel