AP Economy: నాలుగు నెలల్లో 43 వేల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం!

  • పెట్టుబడి వ్యయం కేవలం రూ.2,226 కోట్లు
  • నెల నెలా పడిపోతున్న జీఎస్టీ ఆదాయం
  • వరదలతో మరింత దిగజారే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. రాష్ట్ర ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసిన నివేదిక ప్రకారం అప్పులు కాకుండా, పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్‌ నుంచి జులై వరకు రూ.44,822 కోట్లు ఖజానాకు చేరింది.ఇందులో జిఎస్‌టి, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం ఇచ్చిన గ్రారట్లు వంటివి కలిపి రూ.41 వేల కోట్ల వరకు ఉంది. రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా రూ.43,058 కోట్లు సమకుర్చుకున్నారు. నెలకు దాదాపు 11 వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

రాష్ట్ర ద్రవ్య, ఆదాయ లోటు కూడా ఎన్నడూ లేనంత భారీగానే రికార్డయింది. ఈ నాలుగు నెలల్లో రూ.87,282 కోట్లు మేర ఖర్చులయ్యాయి. ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తేలింది. ఆదాయ లోటు ఏకంగా 137.59 శాతంతో రూ.40,234 కోట్లుగా రికార్డుకాగా, ద్రవ్యలోటు కూడా 83.92 శాతంతో రూ.42,580 కోట్లకు చేరుకున్నట్లు తేలింది.

పెట్టుబడి వ్యయం కేవలం రూ.2,226 కోట్లు

మొత్తం ఖర్చు రూ.87,282 కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా రూ.85,056 కోట్ల వరకు ఉండడం గమనార్హం. అలాగే మొత్తం వ్యయంలో సేవా రంగానికే రూ.49 వేలకోట్ల వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి రూ.2,226 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.

అదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఇప్పుడు వచ్చిన వరదల ప్రభావం రెవిన్యూ వసూళ్ల పైన పడింది. పథకాల నిర్వహణ పైన ఒత్తిడి పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ ను మాత్రమే ప్రవేశ పెట్టింది. దాని గడువు ముగిసి వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది.

Join WhatsApp Channel