Ramoji rao: అక్షర యోధుడు రామోజీ రావు కన్నుమూత

 

Ramoji rao: అక్షర యోధుడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున  కన్నుమూశారు.  ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ
ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున
4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన
పార్థివదేహాన్ని తరలించారు. 

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు,
సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ
తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు
పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే
పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి
ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974
ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన
నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక
మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.

బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇవే రామోజీ అస్త్రాలు

నలుగురు నడిచిన బాట
కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు
నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా
రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు..
చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని
సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకూ
ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక
సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన
మహనీయుడు.

మార్గదర్శి…

అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి
చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్స్‌ సంస్థగా
మార్గదర్శి నిలిచింది . 60 ఏళ్లలో లక్షలాదిమంది ఖాతాదారులకు నిబద్ధతతో
సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు.

వెల్లువలా సంతాప సందేశాలు 

రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర
మోదీ అన్నారు. రామోజీ రావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.
‘‘రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ,
సినీ రంగంపై చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.
ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు’’ అని మోదీ తన పోస్టులో
పేర్కొన్నారు. 

The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK

— Narendra Modi (@narendramodi) June 8, 2024

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత  చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి
కలిగించిందని తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు
జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన
ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు
లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని
ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
తెలియజేశారు.
 

రామోజీరావు అస్తమయంపై ప్రముఖ కథానాయకుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది అని పేర్కొన్నారు. ‘ఓం
శాంతి’ అంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో సంతాపం తెలిపారు.

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది 🙏💔

🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024

రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని
జనసేన అధినత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని
తెలిశాక కోలుకుంటారని భావించానని.. ఆయన ఇక లేరనే వార్త ఆవేదన కలిగించిందని
పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు
చెప్పారు.

Join WhatsApp Channel