న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తమ పార్టీకి వస్తున్న లక్షలాది మంది ఫాలోవర్లు “పాకిస్థానీలు” మరియు “జార్జ్ సోరోస్ గ్యాంగ్” కు చెందిన వారని కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, సుకాంత మజుందార్ చేసిన ఆరోపణలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పక్కా డేటాతో స్క్రీన్ రికార్డింగ్ వీడియోను విడుదల చేసి కేంద్ర మంత్రులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సాధించడంపై శనివారం కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ (X) వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. “సోషల్ మీడియాలో పాకిస్థాన్ మరియు జార్జ్ సోరోస్ గ్యాంగ్ నుండి ఫాలోవర్లను తెచ్చుకునే వారిని చూస్తే నాకు జాలేస్తోంది. మన దేశంలో తగినంత జనాభా, శక్తివంతమైన యువత ఉన్నారు. భారత్ వ్యతిరేక శక్తుల వద్ద మనం వ్యాలిడేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు” అని ట్వీట్ చేశారు.
మరో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అయితే.. CJP కి ఉన్న ఫాలోవర్లలో 49 శాతం పాకిస్థాన్ నుండి ఉన్నారని, కేవలం 9 శాతం మాత్రమే భారతీయులని ఆరోపించారు.
మంత్రుల ఆరోపణలను తిప్పికొడుతూ అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్‌సైట్స్ కు సంబంధించిన ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ డేటా ప్రకారం ఏప్రిల్ 22 నుండి మే 21 మధ్య ఆ పేజీకి ఏకంగా 1.6 బిలియన్ల వ్యూస్ మరియు 1.2 కోట్ల కొత్త ఫాలోవర్లు వచ్చారు. ఫాలోవర్ల డెమోగ్రాఫిక్స్ పరిశీలిస్తే.. 94.1 శాతం మంది ఫాలోవర్లు భారత్ నుండే ఉన్నట్లు ఆ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత అమెరికా (1%), యూకే (0.7%), కెనడా, యూఏఈల (0.6%) నుండి ఉన్నారు.
“మా అకౌంట్ హ్యాక్ కావడానికి ముందు నేను మీడియా కోసం తీసిన స్క్రీన్ రికార్డింగ్ ఇది. ఇందులో 94 శాతానికి పైగా ఆడియన్స్ మన భారతదేశానికి చెందినవారే. సొంత దేశ యువత తమ హక్కుల కోసం గళమెత్తితే.. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి (@KirenRijiju) వారిని ‘పాకిస్థానీలు’ అని ఎలా ముద్రేస్తారు?”
— అభిజీత్ దిప్కే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP పెద్ద ఎత్తున ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్‌కు సుమారు ఆరు లక్షల మంది యువత మద్దతుగా సంతకాలు కూడా చేశారు. అయితే, పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. దాన్ని ప్రశ్నించినందుకే ప్రభుత్వం కక్షపూరితంగా తమ ఎక్స్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ పేజీని హ్యాక్ చేయించిందని, అధికారిక వెబ్‌సైట్‌ను కూడా బ్లాక్ చేసిందని అభిజీత్ ఆరోపించారు. తనకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
చీఫ్ జస్టిస్ చేసిన ఒక వ్యాఖ్యకు నిరసనగా.. కేవలం ఒక వ్యంగ్య మీమ్ పేజీగా మొదలైన కాక్రోచ్ పార్టీ, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులు స్పందించే స్థాయికి చేరడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



