భారతదేశంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన పన్నుల సవరణల కారణంగా సిగరెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో సిగరెట్ల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సగటున రూ. 18 నుండి రూ. 20 వరకు లభిస్తున్న ఒక్క సిగరెట్ ధర త్వరలోనే రూ. 72 కు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025’ కు పార్లమెంట్ ఆమోదం తెలపడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
ఈ బిల్లులో ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచింది. ఇప్పటివరకు 1,000 సిగరెట్ స్టిక్స్‌పై పొడవును బట్టి రూ. 200 నుండి రూ. 735 వరకు డ్యూటీ ఉండేది. తాజా బిల్లు ప్రకారం ఇది ఏకంగా రూ. 2,700 నుండి రూ. 11,000 వరకు పెరగనుంది. దీని ప్రభావం కేవలం సిగరెట్లపైనే కాకుండా.. చూయింగ్ టొబాకో (ఖైనీ), హుక్కా మరియు ఇతర దూమపానాలపై కూడా పడనుంది.

