పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభాస్ మేనియా మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే, అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ఊపందుకున్నాయి.
ఉత్తర అమెరికాలో ‘రాజాసాబ్’ ప్రీ-సేల్స్ అద్భుతంగా సాగుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 30, 2025) నాటికి ఈ చిత్రం $200,000 (సుమారు రూ. 2 కోట్లు) మైలురాయిని దాటేసింది. కేవలం ప్రీమియర్ షోల కోసమే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవ్వడం ప్రభాస్ గ్లోబల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపిస్తోంది.
ప్రత్యాంగీరా యుఎస్ (Prathyangira US) మరియు పీపుల్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 10,000 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ప్రారంభంలో బుకింగ్స్ కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన ‘రిలీజ్ ట్రైలర్ 2.0’ తర్వాత బుకింగ్స్ వేగం పుంజుకుంది.

