సంకష్టహర చతుర్థి విశిష్టత: హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. వినాయకుడికి ప్రీతికరమైన రోజుల్లో ‘సంకష్టహర చతుర్థి’ (Sankashti Chaturthi) అత్యంత ముఖ్యమైనది. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే(కృష్ణ పక్షంలో) చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చవితి అని పిలుస్తారు.ఈ రోజున భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తే సకల కష్టాలు తొలగిపోయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి?
‘సంకష్ట’ అంటే కష్టాలను తొలగించడం అని అర్థం. భక్తుల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలను, ఆటంకాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించే రోజు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ముఖ్యంగా మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థిని ‘అంగారక సంకష్ట చతుర్థి’ అని పిలుస్తారు, దీనికి రెట్టింపు ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పురాణాల ప్రకారం, దేవతలు తమకు కలిగిన కష్టాల నుండి విముక్తి పొందడానికి వినాయకుడిని ప్రార్థించగా, ఆయన చతుర్థి రోజే వారికి అభయమిచ్చాడని కథలు ఉన్నాయి. అలాగే, చంద్రుడికి కలిగిన శాప విమోచనం కూడా ఈ తిథి నాడే జరిగిందని చెబుతారు. అందుకే ఈ రోజున చంద్ర దర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది.
సంకష్టహర చతుర్థి విశిష్టత
ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం:
- ఏదైనా పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే, సంకష్ట చవితి వ్రతం చేయడం వల్ల ఆ విఘ్నాలు తొలగిపోతాయి.
- వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు చేకూరాలని కోరుకునే వారు ఈ రోజు గణపతిని వేడుకుంటారు.
- గణేశుడి మంత్రాలను జపించడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
- జాతకంలో కేతు దోషం లేదా బుధ గ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది.
పూజా విధానం మరియు నియమాలు PDF
సంకష్టహర చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకుని వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయాలి. ఎర్రటి పుష్పాలు, గరిక (Durva Grass) సమర్పించడం గణపతికి ఎంతో ప్రీతికరం. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజలో చంద్ర దర్శనం చాలా ముఖ్యం. రాత్రి చంద్రుడిని చూసిన తర్వాతే అర్ఘ్యం ఇచ్చి, ప్రసాదం తీసుకుని ఉపవాసం విరమిస్తారు.కొందరు రోజంతా ఉపవాసం కూడా ఉంటారు.
Sankatahara Chaturthi Puja PDF
పూజ ప్రారంభంలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదం.
“ఓం గం గణపతయే నమః”

