Rakshabandhan / Rakhi 2025: అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమకు ప్రతీకగా భారత దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ రాఖీ లేదా రక్షా బంధన్. దీన్ని ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) ఈ రక్షా బంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఆగస్టు 9వ తేదీ జరుపుకోనున్నారు. ఎందుకంటే ఇదేరోజు పౌర్ణమి వచ్చింది. అయితే అక్కా లేదా చెల్లెలు రాఖీ కట్టడానికి సరైన సమయం, విధానం తప్పక పాటించాలి అంటున్నారు పండితులు.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఎప్పుడు ..
ఈ ఏడాది(2025) శ్రావణ మాసంలో ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే, ఈ పౌర్ణమి తిథి ఆగస్టు 8న రాత్రి 8:00 గంటల తర్వాత మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం 1:24 గంటలతో ముగుస్తుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు. అలాగే రాఖీ కట్టడానికి శనివారం (9 ఆగస్టు) ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటల లోపు మంచి సమయం అని… ఇంకా మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది రాఖీ కట్టడానికి చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
రాఖీ ఎలా కట్టాలి?
సోదరీ సోదరులిద్దరూ ముందుగా తలంటు స్నానం చేసి దేవుని ఎదురుగా పూజ చేసి సోదరుడి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత రాఖీని కట్టడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే, రాఖీ కట్టేటప్పుడు సోదరుడికి ఎదురుగా కూర్చొని కట్టడం శుభప్రదంగా భావిస్తారు.
రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలి. ఈ మూడు ముళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల.. త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. రెండవ ముడి సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ, నమ్మకం మరియు గౌరవాన్ని సూచిస్తుంది. మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గౌరవం , సత్య మార్గాన్ని అనుసరించాలని … తాను ఏ పరిస్థితిలో ఉన్న తన సోదరిని రక్షించాలని తన విధులను గుర్తు చేస్తుంది.
అలాగే కొన్ని ఇతర నియమాలు పాటించడం ఇద్దరికీ మంచిదని పెద్దలు చెపుతున్నారు. అవి-
చినిగిన లేదా నలుపు రంగు రాఖీలను, ప్లాస్టిక్‌తో చేసిన, అశుభ చిహ్నాలు ఉన్న, దేవతా చిత్రాలతో కూడిన రాఖీలు ఉపయోగించకూడదు.
రాఖీ కడుతున్నప్పుడు సోదరి
ॐ యేన బద్ధో బలి రాజా దానవేన్ద్రో మహాబలః ।
తేన త్వామపి బధ్నామి రక్షే మా చల మా చల్ ।।
అనే మంత్రం చెపుతూ కట్టాలి… ఇది సోదరుడికి దివ్యరక్షణను ప్రసాదిస్తుంది.
ఇంకా… రాఖీ కడుతున్నప్పుడు సోదరుడు దక్షిణ దిశ వైపు చూడకూడదు. రాఖీ కట్టిన తరువాత సోదరుడు తన అక్క కాళ్లను మొక్కాలి. సోదరుడు పెద్దవాడైతే సోదరి అతడికి పాదాభివందనం చేయాలి.
పైన చెప్పిన విధంగా చేస్తే సోదరీ సోదరులు ఇద్దరూ ఆనందంగా ఉంటారని పురాణాలు కూడా సూచిస్తున్నాయి.