భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో హనుమంతుడికి విశిష్ట స్థానం ఉంది. ధైర్యం, శక్తి, భక్తి మరియు జ్ఞానానికి నిలువెత్తు రూపం ఆంజనేయ స్వామి. పదహారవ శతాబ్దంలో గొప్ప కవి తులసీదాస్ గారు రచించిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) నేటికీ కోట్లాది మంది భక్తులకు ఒక కవచంలా పనిచేస్తోంది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా, మానసిక మరియు శారీరక మార్పులు కూడా సంభవిస్తాయని భక్తుల నమ్మకం.
హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు మన జీవితంలోని వివిధ సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ దీనిని పఠించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే:
1. భయం మరియు ఆందోళనల నుండి విముక్తి
హనుమాన్ చాలీసాలో ఒక ప్రసిద్ధ పంక్తి ఉంది – “భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై”. దీని అర్థం మహావీరుడైన హనుమంతుని నామాన్ని స్మరిస్తే ఎటువంటి ప్రతికూల శక్తులు దరిచేరవు. మీకు తెలియని భయం, రాత్రిపూట పీడకలలు లేదా మానసిక ఆందోళనలు వేధిస్తుంటే, నిత్యం చాలీసా చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు తెలియని ధైర్యం కలుగుతుంది.
2. ఆరోగ్యం మరియు శారీరక శక్తి
శారీరక అనారోగ్యంతో బాధపడేవారికి హనుమాన్ చాలీసా ఒక సంజీవని వంటిది. “నాశై రోగ హరై సబ పీరా, జపత నిరంతర హనుమత బీరా” – అంటే నిరంతరం హనుమంతుని నామాన్ని జపించే వారికి రోగాలు నశిస్తాయి మరియు బాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే వారు ప్రతిరోజూ నిష్టతో చాలీసా పఠించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి మరియు మానసిక స్థైర్యం పెరుగుతుంది.
3. ఏకాగ్రత మరియు జ్ఞాన ప్రాప్తి
విద్యార్థులకు హనుమాన్ చాలీసా ఒక గొప్ప వరం. “విద్యవాన గుణీ అతి చాతుర, రామ కాజ కరిబే కో ఆతుర” అని చాలీసాలో వర్ణించినట్లు, హనుమంతుడు సకల విద్యా పారంగతుడు. చదువులో వెనుకబడిన పిల్లలు లేదా ఏకాగ్రత కుదరని వారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదివితే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ‘బుద్ధిహీన తను జానికే..’ అనే శ్లోకం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
4. శని దోష నివారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ప్రభావంతో బాధపడేవారు (ఏల్నాటి శని లేదా అర్ధాష్టమ శని) హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఉపశమనం పొందుతారు. పురాణాల ప్రకారం, హనుమంతుడు శని దేవుడిని బంధ విముక్తుడిని చేసినప్పుడు, హనుమంతుడి భక్తులను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని శని దేవుడు మాట ఇచ్చాడు. అందుకే శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
హనుమాన్ చాలీసాను ఎలా పఠించాలి?
హనుమాన్ చాలీసాను కొన్ని నియమాలతో చదవడం మంచిది. హనుమాన్ చాలీసాని హిందీ కానీ, తెలుగులో కానీ పఠించవచ్చు. దీన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చదవడం ఉత్తమం. ఉతికిన దుస్తులు ధరించి, పూజా గదిలో హనుమంతుని పటం ముందు దీపం వెలిగించి ముందుగా రాముడిని పూజించి ఆ తర్వాత చదవాలి. సాధారణంగా రోజుకు ఒకసారి చదవచ్చు. అయితే, విశేష ఫలితాల కోసం 7 లేదా 11 సార్లు చదవడం శుభప్రదం. వీలైతే స్వామి వారికి అరటిపండు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టవచ్చు.
జై శ్రీరామ్! జై హనుమాన్!

