9వ తరగతిలో త్రిభాషా విధానం: సీబీఎస్‌ఈకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

సీబీఎస్‌ఈ (CBSE) 9వ తరగతి విద్యార్థుల కోసం కొత్తగా తీసుకొచ్చిన సవరించిన త్రిభాషా విధానంపై (Three-Language Policy) సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే విద్యాపరమైన ఒత్తిడిలో ఉన్న విద్యార్థులపై అదనపు భాషను రుద్దడం వల్ల వారిపై మరింత భారం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

సవరించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ ఏడాది (2026) జులై నుండి 6 నుండి 9వ తరగతి విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలు చదవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి. ఈ ఆకస్మిక నిర్ణయంతో పాఠశాలల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సరిపడా పాఠ్యపుస్తకాలు, అర్హత కలిగిన భాషా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు.

ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు మరియు పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 5వ తరగతి నుంచి విదేశీ భాషలు (Foreign Languages) నేర్చుకుంటున్న విద్యార్థులు, ఈ కొత్త నిబంధన వల్ల వాటిని మధ్యలోనే వదిలేయాల్సి వస్తోందని, ఇది వారి అకడమిక్ ప్రణాళికను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులకు మరింత మానసిక ఒత్తిడిని పెంచుతుందని జస్టిస్ బి.వి. నాగరత్న వ్యాఖ్యానించారు. ఒకవేళ మూడో భాష అవసరమైతే, దాన్ని 6వ తరగతిలోనే ప్రవేశపెట్టి, 9వ తరగతి నాటికి ముగించడం సరైన విధానమని ఆమె సూచించారు.

Join WhatsApp Channel