హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ (Peddi) కు తెలంగాణలో అనూహ్యమైన చిక్కులు ఎదురవుతున్నాయి. థియేటర్ల మనుగడ కోసం అద్దె విధానాన్ని రద్దు చేసి, ‘పర్సంటేజ్ విధానాన్ని’తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ఈ కొత్త రూల్‌ను ‘పెద్ది’ సినిమా నుండే ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మరియు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల కష్టాలు, నిర్మాతల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎగ్జిబిటర్ల ప్రధాన డిమాండ్లు ఇవే:
- అద్దె వద్దు.. పర్సంటేజ్ ముద్దు: కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల తరహాలోనే తెలంగాణలోనూ అద్దె విధానం రద్దు చేసి రెవెన్యూ షేరింగ్ (పర్సంటేజ్) పద్ధతిని అమలు చేయాలి. ‘పెద్ది’ సినిమా నుండే ఇది స్టార్ట్ అవ్వాలి.
- టికెట్ రేట్లు పెంచొద్దు: ‘పెద్ది’ సినిమా కోసం ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచినా, తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్ల పెంపు ఉండకూడదని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని, రేట్లు పెంచొద్దని కోరుతూ ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?
ఈ సమావేశం అనంతరం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎగ్జిబిటర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ..
“గతంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా అప్పుడే ఈ పర్సంటేజ్ అంశంపై నిర్మాతలు మాకు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఏడాది గడిచినా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ మూడు వారాలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేవలం మల్టీప్లెక్స్‌లకే పర్సంటేజీలు ఇస్తూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లను అణగదొక్కుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 120 కి పైగా థియేటర్ల యజమానులు దీనస్థితిలో ఉన్నారు. థియేటర్ల మెయింటెనెన్స్ కూడా రావడం లేదు. నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్, ఆడియో అంటూ 14 రకాల ఆదాయాలు వస్తున్నాయి. కానీ థియేటర్లు మాత్రం నష్టపోతున్నాయి.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పెద్ది’ పై పగ లేదు.. కానీ తప్పట్లేదు!
రామ్ చరణ్ సినిమా మీద తమకు ఎలాంటి పగా లేదని, ‘పెద్ది’ లాంటి భారీ సినిమాలకు తాము సెల్యూట్ చేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. అయితే, ఈ సినిమా తర్వాత తమను ఎవరూ పట్టించుకోరనే భయంతోనే ‘పెద్ది’ ని పర్సంటేజ్ శ్లాబ్‌లో చేర్చామని వివరించారు. నిర్మాతలు సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్ సూపర్ హిట్ అయినప్పటికీ, తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం ఇప్పుడు నిర్మాతల మెడకు కత్తిలా మారింది. ఈ ప్రతిష్టంభనను చిత్ర బృందం ఎలా దాటుతుందో వేచి చూడాలి.



