అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తనను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర చేసిందని తేలితే, ఆ దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని తాను ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
‘న్యూస్‌నేషన్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “ఏదైనా జరిగితే ఇరాన్‌ను భూమి మీద నుంచి తుడిచిపెట్టేయాలనే స్పష్టమైన ఆదేశాలను నా అధికారులకు ఇచ్చాను” అని పేర్కొన్నారు. తనపై జరిగే ఏ హత్యా ప్రయత్నానికైనా ఇరాన్ కారణమైతే ఆ దేశం సర్వనాశనం కావడం ఖాయమని హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫాజల్ షేకర్చి తీవ్రంగా స్పందించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటే తాము అమెరికాను తగలబెడతామని ప్రతి హెచ్చరిక చేశారు.
గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ఫిబ్రవరి నెలలో కూడా ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇరాన్ తనను హత్యాకాండ చేయాలని చూస్తే ఆ దేశం కనుమరుగవుతుందని అప్పట్లో హెచ్చరించారు.
గత కొన్ని రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలన అంతం కావాలని ట్రంప్ బహిరంగంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది.

