ఇరాన్‌లో దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టేందుకే కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్ధిక ఇబ్బందులు, నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ మాట్లాడుతూ, కొందరు అల్లరిమూకలు తమ స్వంత వీధులను తామే ధ్వంసం చేసుకుంటున్నారని, మరొక దేశ అధ్యక్షుడి సంతోషం కోసం చేస్తున్న ఈ చర్యలు దేశ ద్రోహమని వ్యాఖ్యానించారు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా తలదూర్చడం మానేసి, తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

