అట్లాంటిక్ మహాసముద్రం వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ, రష్యా రక్షణలో ప్రయాణిస్తున్న ఒక భారీ ఆయిల్ టాంకర్‌ను అమెరికా రక్షణ బలగాలు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సుదీర్ఘ వేట బుధవారం (జనవరి 7, 2026) నాటి ఆపరేషన్‌తో ముగిసింది.
అమెరికా కోస్ట్ గార్డ్ మరియు మిలిటరీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ‘మారినెరా’ (Marinera) అనే రష్యా జెండాతో ఉన్న ఆయిల్ టాంకర్‌ను నార్త్ అట్లాంటిక్ సముద్రంలో సీజ్ చేశారు. ఈ నౌకను గతంలో ‘బెల్లా 1’ (Bella 1) అని పిలిచేవారు. వెనెజువెలాపై అమెరికా విధించిన చమురు దిగ్బంధనాన్ని (Blockade) తప్పించుకుని తప్పించుకు తిరుగుతున్న ఈ నౌకను అమెరికా ఫెడరల్ కోర్టు జారీ చేసిన వారెంట్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ యూరోపియన్ కమాండ్ ధృవీకరించింది.
ఈ నౌక వెనుక పెద్ద కథే ఉంది. అమెరికా అధికారుల సమాచారం ప్రకారం, ఈ టాంకర్ అంతర్జాతీయంగా నిషేధించబడిన లేదా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల (వెనెజువెలా, ఇరాన్, రష్యా) చమురును అక్రమంగా తరలించే ‘షాడో ఫ్లీట్’ (Shadow Fleet) లో భాగం. డిసెంబర్ నెలలో వెనెజువెలా సమీపంలో ఈ నౌకను ఆపేందుకు అమెరికా ప్రయత్నించినప్పుడు, అది తప్పించుకుని అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అమెరికా నుంచి రక్షణ పొందేందుకు ఈ నౌక తన పేరును ‘బెల్లా 1’ నుంచి ‘మారినెరా’గా మార్చుకోవడమే కాకుండా, హుటాహుటిన రష్యా జెండాను (Reflagging) ధరించింది.
ఈ ఆపరేషన్ కేవలం ఒక నౌకను పట్టుకోవడం మాత్రమే కాదు, ఇది అమెరికా-రష్యా మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించింది. తమ జెండాతో ఉన్న నౌకను కాపాడుకోవడానికి రష్యా ఒక సబ్ మెరైన్ (జలాంతర్గామి) మరియు ఇతర యుద్ధ నౌకలను కాపలాగా పంపింది. అయినప్పటికీ, అమెరికా కోస్ట్ గార్డ్ కట్టర్ ‘మున్రో’ (USCGC Munro) మరియు భారీ యుద్ధ విమానాల సహాయంతో అమెరికా బలగాలు నౌకపైకి చేరి దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఈ ఘటనపై రష్యా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో తమ జెండాతో వెళుతున్న నౌకను సీజ్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, నౌక సీజ్ సమయంలో రష్యా దళాల నుంచి ఎటువంటి సాయుధ ప్రతిఘటన ఎదురుకాకపోవడం గమనార్హం.

