15.2 C
Hyderabad
Friday, January 9, 2026
HomeWorldRussia Sanctions Bill: రష్యా నుండి ఆయిల్ కొనే దేశాలపై అంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం

Russia Sanctions Bill: రష్యా నుండి ఆయిల్ కొనే దేశాలపై అంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన “ద్విపాక్షిక ఆంక్షల బిల్లు” (Bipartisan Russia Sanctions Bill) కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం (Lindsey Graham) ఎక్స్ (X) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్‌తో జరిగిన కీలక సమావేశం తర్వాత, రష్యా ఆదాయ మార్గాలను దెబ్బతీసేందుకు ఈ బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టేందుకు అధ్యక్షుడు ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం రష్యా నుండి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా,బ్రెజిల్ వంటి దేశాలకు పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదిత బిల్లులో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై దిగుమతి సుంకాలను (Tariffs) ఏకంగా 500 శాతం వరకు పెంచే అధికారాన్ని ఇది అధ్యక్షుడికి కల్పిస్తుంది.

  • ఉక్రెయిన్ యుద్ధం కోసం పుతిన్ ఉపయోగిస్తున్న నిధులను నిలిపివేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. రష్యా నుండి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా మరియు బ్రెజిల్ దేశాలపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌పై ఉన్న 50 శాతం టారిఫ్‌లను (25% రెసిప్రోకల్ + 25% సెకండరీ) భవిష్యత్తులో మరింత పెంచే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్‌పై తాము విధించిన అధిక సుంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. “ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, కానీ నేను చమురు విషయంలో కఠినంగా ఉన్నందుకు ఆయన సంతోషంగా లేరు” అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, భారత్ ఇప్పటికే రష్యా నుండి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025లో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు, 2026 జనవరి నాటికి 1.2 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయాయి. అమెరికా ఒత్తిడి మరియు తాజా ఆంక్షల భయం వల్ల భారత రిఫైనరీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి.

అమెరికా ఆంక్షల ప్రభావం ఇప్పటికే భారతీయ కార్పొరేట్ సంస్థలపై కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, జనవరి నెల నుండి రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలని లేదా గణనీయంగా తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. కేవలం రిలయన్స్ మాత్రమే కాకుండా, హెచ్‌పీసీఎల్-మిట్టల్ (HMEL) వంటి సంస్థలు కూడా అమెరికా టారిఫ్‌ల నుండి తప్పించుకోవడానికి రష్యా చమురుకు స్వస్తి పలుకుతున్నాయి.

ఈ ఆంక్షల బిల్లు కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, దౌత్యపరమైన వ్యూహం కూడా అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు రావాలని రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ ‘టారిఫ్ వార్’ను ఆయుధంగా వాడుకుంటున్నారు. రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే, వారు యుద్ధాన్ని కొనసాగించడం కష్టమవుతుందని అమెరికా భావిస్తోంది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel