బంగ్లాదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ (Sharif Osman Hadi) హత్య కేసులో బంగ్లాదేశ్ పోలీసులు సంచలనాత్మక అంశాలను వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వ్యక్తులు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించారని వారు అధికారికంగా ప్రకటించారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) ఆదివారం (డిసెంబర్ 28, 2025) నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్ అండ్ ఆపరేషన్స్) ఎస్.ఎన్. మహమ్మద్ నజ్రుల్ ఇస్లాం ఈ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 12న ఢాకాలో హాదీపై కాల్పులు జరిగిన తర్వాత, నిందితులు మయీమన్‌సింగ్ జిల్లాలోని హలువాఘాట్ సరిహద్దు గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ఇస్లాం తెలిపారు.
బంగ్లాదేశ్ పోలీసుల కథనం ప్రకారం, ఉస్మాన్ హాదీ హత్యలో కీలక సూత్రధారులైన ఫైసల్ కరీం మసూద్ మరియు ఆలంగీర్ షేక్ బంగ్లాదేశ్ నుండి తప్పించుకుని మేఘాలయ రాష్ట్రంలో తలదాచుకున్నట్లు సమాచారం ఉందని, వారు సరిహద్దు దాటడానికి స్థానిక సహకారం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరిహద్దు దాటిన తర్వాత ‘పుర్తి’ అనే వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని, అనంతరం ‘సామీ’ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా (Tura) పట్టణానికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలిందని అంతేకాదు ఈ క్రమంలో వీరికి సహకరించిన పుర్తి మరియు సామీలను భారత అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక సమాచారం ఉందని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు.
నిందితులు భారత్‌లోకి పారిపోయారన్న వార్తలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నిందితులను అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించేలా భారత అధికారులతో అధికారిక మరియు అనధికారిక మార్గాల్లో సంప్రదింపులు జరుపుతున్నట్లు నజ్రుల్ ఇస్లాం స్పష్టం చేశారు. అయితే, ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

