పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ‘ఓపెన్ వార్’.. కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం!

by Eevela_Team
0 comments

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య సాగుతున్న దాడులు, ప్రతిదాడులు తాజాగా పూర్తిస్థాయి యుద్ధానికి (‘ఓపెన్ వార్’) దారితీశాయి. శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) తెల్లవారుజామున ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌తో పాటు కాందహార్, పక్తికా వంటి కీలక నగరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది.

పాక్ భారీ ఆపరేషన్: ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’

ఆఫ్ఘన్ తాలిబన్ల దాడులకు నిరసనగా పాకిస్థాన్ ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ పేరుతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్ ఫైటర్లు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని పాక్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ వెల్లడించారు. “మా సహనం నశించింది, ఇక ఇది ముఖాముఖి యుద్ధమే” అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

తాలిబన్ల మెరుపు దాడులు.. 15 పోస్టులు స్వాధీనం?

అంతకుముందు గురువారం రాత్రి, ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారీస్థాయిలో దాడులు చేశాయి. ఈ మెరుపు దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన 15కు పైగా సైనిక అవుట్‌ పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నామని, 40 మంది పాక్ సైనికులను హతమార్చామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, డ్రోన్ల సాయంతో పాక్ భూభాగంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు కూడా వారు పేర్కొన్నారు.

గత ఆదివారం పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా సుమారు 13 మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దీనికి ప్రతీకారంగానే తాము దాడులు ప్రారంభించినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న ‘డ్యూరాండ్ లైన్’ సరిహద్దు వివాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి.

ఈ పరిణామాలపై రష్యా, చైనా, ఇరాన్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా విదేశాంగ శాఖ కోరింది. అటు చైనా కూడా ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించింది.

You may also like

Join WhatsApp Channel
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00