శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ, ఆ పార్టీకి చెందిన కీలక నేత దోసల అనిల్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో ఆయనతో పాటూ పలువురు కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ స్వయంగా అనిల్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గాంధీ, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోకుండా, అధికార పక్షంతో అంటకాగుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఇతర కీలక నేతలు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్‌కు ఉన్న పట్టును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. నగర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, ప్రస్తుతం అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉందని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఈ చేరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నా..క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న అనిల్ రెడ్డి వంటి నాయకులు పార్టీలోకి రావడం శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

