తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. గత ఎన్నికల ఫలితాల నుండీ రాజకీయాలకు కాస్త దూరంగా, తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. డిసెంబర్ 29 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరుకావాలని ఆయన నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సభకు హాజరవడం ఇది మూడోసారి మాత్రమే కానుంది. గతంలో గవర్నర్ ప్రసంగం మరియు బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే ఆయన సభలో కనిపించారు.
ఈరోజు సాయంత్రం ఆయన బంజారాహిల్స్‌లోని తన నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. కేసీఆర్ ఇప్పటికే తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
రేవంతి రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. కేసీఆర్ ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది:
- రైతు భరోసా నిధుల జమలో జరుగుతున్న ఆలస్యం, రుణమాఫీ అమలులోని లోపాలపై కేసీఆర్ గళమెత్తనున్నారు.
- మహబూబ్‌నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా నది నీటి వాటా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చర్చకు పట్టుబట్టనున్నారు.
- ఫార్మా సిటీ రద్దు, కొత్తగా ప్రతిపాదించిన హిల్ సిటీ పాలసీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.
- పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు, ఉద్యోగుల సమస్యలపై కూడా కేసీఆర్ మాట్లాడనున్నట్లు సమాచారం.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం బీఆర్ఎస్ క్యాడర్‌లో కొత్త జోష్ నింపే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస ఓటములు, ఇతర పార్టీల్లోకి వలసల నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం పార్టీకి బలాన్ని ఇస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ రాకను ఆహ్వానిస్తూనే, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా “కేసీఆర్ సభకు వస్తే అన్నీ వివరిస్తాం” అని చెప్పడం, రేపటి నుంచి జరగబోయే సభలో వాడీవేడీ చర్చలకు వేదిక కాబోతోందని స్పష్టం చేస్తోంది.

