రెండురోజుల తెలంగాణా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం, పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు.
ఈ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ, మోదీ గ్యారెంటీ అంటే, మోదీ ఏం చెబితే అది చేసి చూపిస్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. విదేశాల్లో మనవాళ్లు చాలమంది ఉన్నారు. అందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంగా ఉందన్నారు. దేశ అర్థిక అభివృద్దిలో కొత్త అధ్యయనం లిఖించామన్నారు.
తాను వారసత్వ రాజకీయాలను నేను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. కుటుంబపార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖాజానాను నింపుకుంటున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నాం. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ నాపై విమర్శలు చేస్తోంది. నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారని తెలిపారు. కానీ దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబమేనని చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని, తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోందని బీజేపీని బాగా ఆదిరిస్తున్నారని ఆయన తన ప్రసంగంలో అన్నారు.