David Johnson : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ ఆత్మ‌హ‌త్య‌..

 

David Johnson : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ ఆత్మ‌హ‌త్య‌..

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న
వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరులో తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్
బాల్క‌నీ నుంచి కింద‌కు దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. నాలుగో
అంత‌స్తు నుంచి దూక‌డంతో అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.
గ‌త‌కొంత‌కాలంగా ఆయ‌న తీవ్ర‌మైన డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా
తెలుస్తోంది.

టీమ్ఇండియా త‌రుపున జాన్స‌న్ రెండు టెస్టులు మాత్ర‌మే ఆడాడు. 1996లో
అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశాడు.
డిసెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రితో డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన టెస్టు మ్యాచే అత‌డికి
ఆఖ‌రిది. కుడి చేతివాటం పేస్ బౌల‌ర్ అయిన జాన్స‌న్ త‌న రెండు టెస్టు
మ్యాచుల కెరీర్‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

డేవిడ్ జాన్సన్ మృతి పట్ల టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సంతాపం
తెలిపారు. ‘నా క్రికెట్ స‌హోద్యోగి డేవిడ్ జాన్స‌న్ మ‌ర‌ణ‌వార్త విని ఎంతో
బాధ‌ప‌డ్డాను. అత‌డి కుటుంబానికి హృద‌యపూర్వ‌క సానుభూతి
తెలియ‌జేస్తున్నాను. చాలా త్వ‌ర‌గా వెళ్లిపోయాడు బెన్నీ.’ అని కుంబ్లే
సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

Join WhatsApp Channel