27.7 C
Hyderabad
Monday, January 12, 2026
HomeScience & TechnologyPSLV-C62: పీఎస్ఎల్వీ-C62 ప్రయోగం విఫలం.. నింగిలోనే కూలిన 'అన్వేష'

PSLV-C62: పీఎస్ఎల్వీ-C62 ప్రయోగం విఫలం.. నింగిలోనే కూలిన ‘అన్వేష’

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు కొత్త ఏడాదిలో ఊహించని షాక్ తగిలింది. 2026 సంవత్సరంలో చేపట్టిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక ప్రయోగం పీఎస్ఎల్వీ-C62 (PSLV-C62) విఫలమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రయోగం, చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో అర్ధాంతరంగా ముగిసింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘అన్వేష’ (EOS-N1) ఉపగ్రహంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరలేకపోయాయి.

సోమవారం ఉదయం సరిగ్గా 10:18 గంటలకు పీఎస్ఎల్వీ-C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభమైన మొదటి రెండు దశలు అత్యంత విజయవంతంగా సాగాయి. రాకెట్ గమనం సజావుగానే ఉన్నట్లు గ్రౌండ్ స్టేషన్ నుంచి సంకేతాలు అందాయి. అయితే, మూడో దశ (PS3) పూర్తయ్యే సమయంలో అకస్మాత్తుగా రాకెట్ తన గమనాన్ని మార్చుకుంది. టెలిమెట్రీ డేటా ప్రకారం, రాకెట్ నిర్ణీత వేగాన్ని అందుకోలేకపోవడమే కాకుండా, దాని నిర్దేసిత మార్గం నుంచి పక్కకు మళ్లింది.

ఈ ప్రయోగంలో ప్రధాన పేలోడ్ అయిన EOS-N1 (అన్వేష) ఉపగ్రహంపై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం, భారత సరిహద్దుల్లో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మరియు సముద్ర నిఘా కోసం రూపొందించబడింది. కేవలం ఈ ఒక్క ఉపగ్రహమే కాకుండా, భారతీయ స్టార్టప్‌లు, విద్యా సంస్థలు మరియు విదేశీ దేశాలకు (సింగపూర్, అమెరికా, బ్రెజిల్ మొదలైనవి) చెందిన మరో 15 ఉపగ్రహాలు కూడా ఈ ప్రయోగంలో భాగంగా ఉన్నాయి. రాకెట్ వైఫల్యంతో ఈ 16 ఉపగ్రహాలు కూడా నింగిలోనే అంతమైపోయాయి.

ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఈ వైఫల్యంపై ప్రాథమిక సమాచారం అందించారు. రాకెట్ మూడో దశలో ‘రోల్ రేట్’ లో మార్పులు రావడం వల్ల రాకెట్ అదుపు తప్పిందని, దీనివల్ల వేగంలో లోపం తలెత్తిందని ఆయన వెల్లడించారు. “ప్రయోగం మొదట్లో అంతా బాగానే ఉన్నా, మూడో దశ చివరలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డేటాను విశ్లేషిస్తున్నాం, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

ఇస్రో చరిత్రలో పీఎస్ఎల్వీ రాకెట్‌కు అత్యంత విజయవంతమైన రికార్డు ఉంది. అయితే, గతేడాది (మే 2025) జరిగిన పీఎస్ఎల్వీ-C61 ప్రయోగం కూడా ఇలాగే మూడో దశలో సాంకేతిక సమస్య కారణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే విభాగంలో సమస్య తలెత్తడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా రెండోసారి పీఎస్ఎల్వీ ప్రయోగం విఫలం కావడం భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి (NSIL) కూడా నష్టమే.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel