కూటమి నుంచి జనసేన-బిజెపిలు బయటికి వస్తాయా? దానికోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన అధినేత వేస్తున్న ప్రతీ అడుగు గమనిస్తున్న కొందరు విశ్లేషకులు కొద్ది నెలల నుండి చంద్రబాబు సర్కార్ అవినీతిపై, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ బయటికి కనిపించని వ్యతిరేకతను చూపిస్తున్నారని అంటున్నారు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తాను ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చని పవన్ భావించారు, అయితే చంద్రబాబు నిర్ణయాలు, టిడిపి నేతల వైఖరి పవన్ కళ్యాణ్ కు రుచించడం లేదు. ఎంతో పోరాడి వైసిపిని దించి కూటమిని అధికారంలోకి తెచ్చినా తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు అని, ప్రజలు ఈ ప్రభుత్వంపై నమ్మకంగా లేరు అని ఆయన భావిస్తున్నారట. కూటమి అవినీతి మరకలు తనకు అంటకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలో వ్యూహాలు రచిస్తున్నారట.
మరోవైపు ఇటీవల విడుదల అయిన అనేక సర్వేల్లో వైసిపి పుంజుకున్నట్లు వెల్లడి అవుతున్న నేపధ్యంలో.. ప్రభుత్వ వ్యతిరేక భావన ప్రజల్లో వచ్చినా, ఆ మరక జనసేనకు అంటకూడదు అని పవన్ మనసులో భావిస్తున్నారు. ఇప్పటికీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీపరుడు అనే భావన చెరిగిపోలేదు. అయితే కూటమిలోని టిడిపి నాయకుల తప్పులు, అవినీతి పనుల వల్ల తన ఇమేజ్ కు డ్యామేజి కాకుండా సరైన సమయం చూసి కూటమి నుంచి బయటికి రావాలని .. దీనికి సరైన సమయాన్ని బిజెపి కేంద్ర అధినాయకత్వం నిర్ణయిస్తుందని విశ్లేషకుల అంచనా!
నిజానికి జమిలి ఎన్నికలకు వెళ్ళాలని బిజెపి గట్టిగా భావిస్తుంది. ఈలోగా కూటమి ఓట్లు పూర్తిగా వైసిపికి తిరిగి వెళ్ళకుండా బిజెపి-జనసేన కూటమి వైపు ఆకర్షించాలంటే ఏమి చెయ్యాలి అనే ఆలోచనలో ఆయా పార్టీల వ్యూహకర్తలు ఉన్నారు.
ఇంతకీ కొసమెరుపు ఏంటి అంటే, పవన్ మనసులో ఏమి ఉందొ స్పష్టంగా తెలియాలంటే ఇంకా కొన్ని నెలలపాటు వేచిచూడాల్సిందే అని కూడా అదే విశ్లేషకులు చెపుతున్నారు.

