18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ
కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ
స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీపడుతోంది.
దాదాపు 50ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటం మళ్లీ ఇప్పుడు
కావడం గమనార్హం. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా (Om Birla)
నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (K.
Suresh) బరిలో నిలిచారు.
వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉప
సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా..
గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన
సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి
ఉప సభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే..
డిప్యూటీ స్థానాన్ని (Depity Speaker Post) తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి.
ఈ
క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను భాజపా రంగంలోకి దించింది. ఈ
ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్ ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా
కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే
సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు
ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. ఉప సభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ
ముందుంచాయి. కానీ, దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో
ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని
నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు.
ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం (జూన్ 26) ఈ
ఎన్నిక నిర్వహించనున్నారు.