కాపుల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకోండి : హరిరామజోగయ్యపై టీడీపీ నేత ఓవీ రమణ ఫైర్

Photo of author

Eevela_Team

Share this Article

టీడీపీ-జనసేన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో కాపుల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారా? అని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నేత ఓవీ రమణ నిలదీశారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియాకు లేఖలు రాస్తూ కాపు నాయకుడు అని చెప్పుకునే హరిరామజోగయ్య అనవసర చర్చలకు చోటిస్తున్నారని అన్నారు.

ఆనాడు చిరంజీవిని ఓడించినప్పుడు, పవన్ కళ్యాణ్ ని రెండు చోట్ల ఓడించినప్పుడు మీకు జాతి ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? కాపుల ఐక్యత కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా రాయలసీమ నుంచి కదిలిన కాపులపై ఆనాడు పాలకొల్లులో జోగయ్య కుమారుడు దాడికి దిగడం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ నాటి దాడుల ద్వారా కాపు జాతికి ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు. మీ మాటల ద్వారా కాపులను పలచపరుస్తున్నారు. జనసేన, టీడీపీలకు మద్దతుగా కాపులను ప్రభావితం చేయాలే కానీ, ఇలా స్వప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగి అనవసరమైన లేఖలు పంపించడం మానుకోవాలన్నారు.

ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాను, ముఖ్యమంత్రి స్థానాన్ని ఎలా అడగ్గలను అని నిర్మొహమాటంగా పవన్‌ చెబుతుంటే జనసేన పార్టీలో సభ్యుడు కూడా కాని జోగయ్య ఎన్ని సీట్లు అడగాలో శాసించడం సబబేనా అని అన్నారు. నిజంగా మీకు కాపు జాతిపై ప్రేమ ఉంటే కాపులను ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ కు వోట్లు వేసేలా చేయాలి. అంతేకానీ స్వార్థ ప్రయోజనాల కోసం కాపుల్లో చీలిక తెస్తే కాపు ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. హరిరామజోగయ్య తన వయసుకు తగ్గట్టు నడుచుకోవాలని హితవు పలికారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel