Lok Sabha Elections 2024: బీజేపీకి పూర్తి మెజార్టీ కష్టమేనా?

Photo of author

Eevela_Team

Share this Article

చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని డంకా బజాయించి మరీ చెపుతుంది. 

542 స్థానాలున్న లోక్ సభలో సాధారణ మెజారిటీకి 272 స్థానాలు అవసరం కాగా గత 2019 ఎన్నికలలో బిజెపి స్వంతంగా 303 స్థానాలను సాధించి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత  ఉన్న  2014 లో కూడా బిజెపి స్వంతంగా 282 స్థానాలు గెలుచుకుంది. ఈ రెండు ఎన్నికలలో బిజెపికి ఎక్కువ స్థానాలు అందించిన రాష్ట్రాలు  బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, డిల్లీ, రాజస్తాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. 

అయితే ఈసారి ఆ రాష్ట్రాలనుంచి బిజెపికి సీట్లు తగ్గవచ్చు అని కొందరు విశ్లేషకులు చెపుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఎంత పెంచుకుందామన్నా సీట్లు పెరగవు అని ముందే తెలుసుకున్న బిజెపి దక్షిణ బారతదేశంపై దృష్టి కేంద్రీకరించింది అని, టిడిపి తో పొత్తుకి ఇదే కారణం అని వారు చెపుతున్నారు. నిజానికి ఈసారి దక్షిణాది నుంచి బిజెపికి కాస్త సీట్లు పెరగనున్న మాట వాస్తవమే అని, అయితే ఉత్తరాదిలో కోల్పోతున్న సీట్ల సంఖ్య కూడా భారీగానే ఉండవచ్చు అని వాదిస్తున్నారు. 

 ఈ ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలన్న లక్ష్యంలో భాగంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కూడా భారీ ప్రచారంతో చేసింది ఆ పార్టీ. అయితే ఆ అంశం కూడా అనుకున్న మేరకు పార్టీకి వోట్లు రాబట్టలేక పోతుంది. స్థానిక అంశాలకే వోటర్లు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ధరలు , నిరుద్యోగం లాంటి అంశాలు ప్రతీ వోటరునూ ప్రభావితం చేస్తున్నాయి.  అలాగే రాజ్యాంగాన్ని మారుస్తాం అనీ, రిజర్వేషన్లు తీసేస్తాం అని ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వ్యతిరేక ప్రభావం చూపనున్నాయి.

ఈ 2024 ఎన్నికల్లో బిజెపి సీట్లు 200 నుంచి 220 వరకే రావచ్చు అని, ఎన్డీఏ కూటమిగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అలా జరిగితే కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాయి. రాబోయే అయిదేళ్లు ప్రభుత్వాన్ని బిజెపి అనుకుంటున్న విధంగా నడపలేకపోవచ్చు అని విశ్లేషకులు చెపుతున్నారు. 

చూడాలి .. మళ్ళీ సంకీర్ణ సర్కారు వస్తే..  దేశానికి ఏమేరకు నష్టం చేస్తాయో .. లాభం చేకూరుతుందో?!

Join WhatsApp Channel
Join WhatsApp Channel