ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు దాదాపు పదేళ్లుగా ప్రాణప్రదంగా ప్రేమించిన సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన విడుదలైన సీజన్ 5 చివరి ఎపిసోడ్‌తో ఈ అద్భుతమైన ప్రయాణం ముగిసింది. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ చివరి భాగం (Volume 3) జనవరి 1, 2026 ఉదయం 6:30 గంటలకు (IST) ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ సిరీస్ చూడటానికి ఒక్కసారిగా లక్షలాది మంది ఎగబడటంతో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వినియోగదారులు ‘అవుటేజ్’ సమస్యను ఎదుర్కొన్నారు. గతంలో సీజన్ 4 విడుదలైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది, ఇప్పుడు ఫైనల్ సీజన్‌కు కూడా అదే పునరావృతం కావడం ఈ సిరీస్ రేంజ్ ఏంటో చెప్తోంది.
దాదాపు 2 గంటల 8 నిమిషాల నిడివి గల ఈ చివరి ఎపిసోడ్ ఒక ఫీచర్ ఫిల్మ్‌ను తలపించింది. హాకిన్స్ గ్యాంగ్ మరియు విలన్ వెక్నా (Vecna) మధ్య జరిగిన తుది పోరాటం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది. ఎలెవెన్ (Eleven) తన శక్తులతో అప్‌సైడ్ డౌన్ (Upside Down)ను అంతం చేసేందుకు చేసిన ప్రయత్నం, ఆమె చేసిన త్యాగం అభిమానుల కళ్లలో నీళ్లు తెప్పించింది.
ముగింపు ఎలా ఉందంటే
ఎలెవెన్ ప్రాణాలతో ఉందా లేదా అనే విషయాన్ని దర్శకులు కొంతవరకు రహస్యంగానే ఉంచారు. మైక్ నమ్మకం ప్రకారం ఆమె బతికే ఉంది, కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందనేది సస్పెన్స్. మైక్, డస్టిన్, లూకాస్: వెక్నా పతనమైన తర్వాత వీరంతా తమ సాధారణ జీవితాల్లోకి వెళ్లారు. మైక్ రచయితగా మారగా, డస్టిన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు.మ్యాక్స్ కోమా నుంచి కోలుకుని లూకాస్‌తో తన మూవీ డేట్‌కు వెళ్లడం ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చింది.
అయితే, ఈ ముగింపుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ ముగింపు అత్యంత భావోద్వేగంగా ఉందని, పాత్రలన్నింటికీ సరైన ముగింపు దక్కిందని ప్రశంసిస్తుండగా.. మరికొందరు వెక్నా మరణం చాలా సులభంగా జరిగిపోయిందని, కథను కొంచెం వేగంగా ముగించినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. “స్ట్రేంజర్ థింగ్స్ ఒక శకాన్ని ముగించింది” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
మొత్తానికి 2016లో ప్రారంభమైన ఈ ప్రయాణం 2026లో ముగిసింది. చిన్న పిల్లలుగా కెరీర్ మొదలుపెట్టిన నటీనటులు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగారు. హాకిన్స్ పట్టణం మరియు ఆ మిత్రుల బృందం వెండితెరపై సృష్టించిన మ్యాజిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
