కోలీవుడ్ సూపర్ స్టార్, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేశారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వెండితెరపై రారాజుగా వెలిగిన విజయ్, తన 69వ చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan) తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఈరోజు మలేషియాలో జరిగిన ఒక ఆడియో లాంచ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ఒక వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. “సినిమాల నుంచి తప్పుకోవడం అనేది నాకు కూడా కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఒక్కోసారి జీవితంలో పెద్ద లక్ష్యాల కోసం కొన్నింటిని వదులుకోక తప్పదు. మీరు నాపై చూపించిన ఈ ముప్పై ఏళ్ల ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ కంటతడి పెట్టుకున్నారు.
విజయ్ తన ప్రసంగంలో “ఎన్ నెంజిల్ కుడియిరుక్కుం” (నా గుండెల్లో కొలువై ఉన్న అభిమానులారా) అంటూ సంబోధిస్తూ, అభిమానులే తన బలమని మరోసారి చాటిచెప్పారు. ఇది తన చివరి సినిమా అని గుర్తు చేసుకున్నప్పుడు కలిగే బాధను మాటల్లో వర్ణించలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జననాయగన్ చిత్రం ఒక పక్కా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.దీనిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తున్నారు. మమిత బైజు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్-అనిరుధ్ కాంబినేషన్‌లో వస్తున్న చివరి చిత్రం కావడంతో మ్యూజిక్ ఆల్బమ్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇటీవల విడుదలైన ‘చెల్ల మగలే’ (Chella Magale) పాట తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పడానికి ప్రధాన కారణం ఆయన రాజకీయ రంగప్రవేశం. ఇప్పటికే ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పేరుతో పార్టీని స్థాపించిన విజయ్, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. “ఇకపై నా సమయం మొత్తం ప్రజల కోసమే. వెండితెరపై నటన చాలు, ఇక ప్రజల మధ్య ఉండి ప్రజాసేవ చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.
అభిమానులు ఒకవైపు విజయ్ రాజకీయాల్లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నా, తమ అభిమాన హీరోను మళ్లీ స్క్రీన్‌పై చూడలేమన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో #Thalapathy69, #JanaNayagan, #ThalapathyForever వంటి హాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

