విజయ్ చివరి సినిమాగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆకస్మికంగా సినిమా వాయిదా పడింది.
ఈ చిత్రం వాయిదా పడటానికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డు (CBFC) నుంచి క్లియరెన్స్ లభించకపోవడమే అని తెలుస్తోంది. చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు, సంభాషణలపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సర్టిఫికేట్ మంజూరులో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్ చేసింది. తుది ఉత్తర్వులు జనవరి 9వ తేదీ ఉదయం వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో ప్రదర్శించబడాలంటే అంతకుముందే సెన్సార్ ప్రక్రియ పూర్తికావాలి. విడుదల రోజునే కోర్టు తీర్పు రానుండటంతో, జనవరి 9న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అసాధ్యమని నిర్మాతలు భావించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇది ఆయన ఆఖరి సినిమా కావడంతో తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ భారీ వేడుకలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే వాయిదా వార్తతో బుక్ మై షో (BookMyShow) వంటి పోర్టల్స్ నుంచి సినిమా షోలను తొలగించడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ సొమ్మును వాపస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.

