ఈరోజు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ‘స్కంద షష్ఠి’ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. పార్వతీపరమేశ్వరుల తనయుడు, దేవసేనాధిపతి అయిన కుమారస్వామి (మురుగన్) జన్మించిన పవిత్ర తిథి కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఈ పర్వదినం విశిష్టత, పూజా ముహూర్తం మరియు విశేషాల గురించి పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఎప్పుడు జరుపుకుంటారు?
పంచాంగం ప్రకారం, పౌష మాసం శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. 2025 లో ఈ తిథి 2025, డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 01:42 గంటలకు ప్రారంభమై 2025, డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 01:43 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి మరియు మధ్యాహ్న సమయం పరిగణనలోకి తీసుకుంటే, డిసెంబర్ 25, గురువారం రోజే ప్రధానంగా వ్రతాన్ని ఆచరించాలని పంచాగ కర్తలు చెపుతున్నారు.
పురాణ నేపథ్యం: తారకాసుర సంహారం
స్కంద పురాణం ప్రకారం, లోకకంటకుడైన తారకాసురుడిని, సూరపద్ముడిని సంహరించి ముల్లోకాలను కాపాడటానికి శివుని తేజస్సు నుంచి కుమారస్వామి జన్మించాడు. ఆరు రోజుల పాటు జరిగిన భీకర యుద్ధం తర్వాత షష్ఠి తిథి నాడు స్వామివారు విజయం సాధించారు. అందుకే ఈ రోజును ‘విజయానికి ప్రతీక’గా జరుపుకుంటారు. తమిళనాట ఈ వేడుకను ‘శూరసంహారం’ పేరుతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
పూజా విధానం మరియు నియమాలు
స్కంద షష్ఠి రోజున భక్తులు కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు, పంచామృతాలతో అభిషేకం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ‘స్కంద షష్ఠి కవచం’, ‘సుబ్రహ్మణ్య భుజంగం’ పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఇంటి పూజా మందిరంలో ఆరు ముఖాల దీపాన్ని (షణ్ముఖ దీపం) వెలిగించి, ఎర్రటి పూలతో స్వామిని పూజించాలి.
తమిళనాడులోని తిరుచెందూర్, పళని, స్వామిమలై మరియు ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలు వంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నేడు ‘తమిళ కడవుల్’ మురుగన్‌కు ప్రత్యేక కావడి ఉత్సవాలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.

