Rishi Panchami 2025: ‘ఋషి పంచమి’ అంటే సప్తర్షుల పంచమి. ఈ రోజు సప్తర్షులైన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ మహర్షులను ఆరాధిస్తారు. సప్తర్షులను స్మరించడం ద్వారా జ్ఞానం, ఆయురారోగ్యం, కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
Rishi Panchami 2025 ఎప్పుడు? శుభ ముహూర్తం
ఋషి పంచమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. దీన్ని గణేశ్ చతుర్థి తరువాతి రోజు అయిన భాద్రపద శుక్ల పంచమి నాడు ఆచరిస్తారు. 2025లో ఋషి పంచమి ఆగస్ట్ 28, 2025 న వచ్చింది. పంచమి తిథి ఆగస్ట్ 27 సాయంత్రం 3:44 గంటల నుండి ఆగస్ట్ 28 సాయంత్రం 5:56 గంటల వరకు ఉంది. అయితే పంచాంగం ప్రకారం సూర్యోదయం వచ్చే ఆగస్ట్ 28 నాడు జరుపుకోవాలని పండితులు సూచించారు. ఆరోజు ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు పూజా కార్యక్రమాలకు మంచిగా ఉంది. కొందరు పండితులు మధ్యాహ్నం 11:50 – 2:28 సమయం పూజకు శ్రేష్ఠమని చెబుతున్నారు.
ఋషి పంచమి ప్రాముఖ్యత
ఋషి పంచమి కోసం బ్రహ్మాండ పురాణం, భావిష్యోత్తర పురాణం లలో ప్రస్తావన ఉంది. సప్తర్షుల విగ్రహాలను పంచామృతంతో స్నానం చేయించి, దీపారాధన చేసి, ఉపవాసం చేయడం ద్వారా పూర్వపాపాలు, ముఖ్యంగా స్త్రీల ఋతుక్రమానికి సంబంధించిన ఆచార లోపాలు నివారణ అవుతాయని పురాణాలు చెపుతున్నాయి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా స్త్రీలు ఆచరిస్తారు. కొంతమంది పురుషులు కూడా భార్యల శ్రేయస్సుకోసం చేస్తారు.
ఋషి పంచమి ఎలా చెయ్యాలి?
ఋషి పంచమి నాడు స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్రలేచి పాలు, పెరుగు, తులసి కలిపిన నీటితో స్నానం చేస్తారు. ఇంటిని శుభ్రం చేసి దేవుని ప్రదేశం వద్ద పసుపుతో ఏడు కొండలు వేసి, వాటిని సప్తర్షులుగా భావించి వాటికి పూలు, పళ్ళు, పానకం, పంచామృతం, దీపం సమర్పిస్తారు.ఈ సందర్భంలో సప్తర్షుల మంత్రం జపిస్తారు.
సప్తర్షుల మంత్రం:
కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో గౌతమః।
జమదగ్నిః వశిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతాః॥
తర్వాత పూజ అనంతరం ఋషి పంచమి కథ చెప్పుకుని బ్రాహ్మణులకు దానం చేసి, ఉపవాస దీక్ష విరమిస్తారు.
ఋషి పంచమిని ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో చేస్తారు. దక్షిణ భారత దేశంలో పెద్దగా ఆచరించకపోయినా పోయినా, కొంతమంది పురాతన వేద కుటుంబాల వారు జరుపుకుంటారు.