న్యూఢిల్లీ: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) భారతదేశ UPI మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇకపై UPI చెల్లింపులు ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల నుండి కేవలం 10 సెకన్లలోపే జరుగుతాయని ఆ సంస్థ తెలిపింది.
జూన్ 16 నుంచి అమలులోకి వచ్చే ఈ మార్పుల వల్ల PhonePe, Google Pay, Paytm వంటి ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులు మరింత వేగంగా చెల్లింపులు జరుగుతాయి.
ఇప్పటికే అత్యధిక భారతీయులు ఆన్లైన్ చెల్లింపులకోసం UPI నే ఉపయోగిస్తున్నారు. అయితే చాలాసార్లు పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అయినట్లు మెసేజ్ వెంటనే రావడంలేదు. అలాగే చాలా చెల్లింపులు ప్రొసెసింగ్ లేదా పెండింగ్ లో ఉండి ఎప్పటికోగానీ ఆ స్థితి ఏంటి అనేది తెలియడం లేదు. వారి ఎకౌంట్ నుండి డబ్బులు కట్ అయినా అవి ఏం అయిపోయాయో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల NPCI జారీచేసిన ఒక సర్క్యులర్ ప్రకారం, ఈ నవీకరణ వల్ల వినియోగదారులకు అనేక లాభాలు ఉంటాయని తెలిపింది. జరిగిన లావాదేవీ స్థితిని తనిఖీ చేయడం, ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే రివర్సల్స్ ప్రారంభించడం.. అలాగే పేమెంట్ చేసే ముందు చిరునామాలను ధృవీకరించడం వంటి కార్యకలాపాలలో జాప్యాలను బాగా తగ్గిస్తుంది. అది ఎంతగా అంటే ..
చెల్లింపు స్థితి నిర్ధారణ సమయం: 30 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గించబడింది.
చిరునామా ధ్రువీకరణ సమయం: 15 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గించబడింది.
“పైన పేర్కొన్న ఈ నవీకరణల వల్ల వినియోగదారులు సరికొత్త అనుభవాన్ని పొందుతారు.” అని NPCI పేర్కొంది. దీనివల్ల ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరగడానికి, మరిన్ని వినియోగదారులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ చర్య వినియోగదారులకు మాత్రమే కాకుండా చెల్లింపు బ్యాంకులు, లబ్ధిదారుల బ్యాంకులు మరియు PSP లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని, డిజిటల్ లావాదేవీలను వేగంగా మరియు మరింత నమ్మదగినదిగా చేస్తుందని భావిస్తున్నారు.