చైనా నుంచి వెల్లువెత్తుతున్న చౌకైన ఉక్కు (Steel) దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి మరియు దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడటానికి భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలను (Tariffs) విధిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం (డిసెంబర్ 30, 2025) రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, దిగుమతి సుంకాలు ఒకేసారి కాకుండా మూడు సంవత్సరాల పాటు దశలవారీగా అమలులో ఉంటాయి. దీనిని ‘సేఫ్‌గార్డ్ డ్యూటీ’ (Safeguard Duty) గా వ్యవహరిస్తారు. ఇది మొదటి ఏడాది (ఏప్రిల్ 21, 2025 – ఏప్రిల్ 20, 2026) 12 శాతం అదనపు సుంకం శాతంగా ఉండనుంది. అలాగే రెండవ ఏడాది (ఏప్రిల్ 21, 2026 – ఏప్రిల్ 20, 2027) 11.5 శాతం అదనపు సుంకం, మూడవ ఏడాది (ఏప్రిల్ 21, 2027 – ఏప్రిల్ 20, 2028) 11 శాతం అదనపు సుంకం విధించనుంది. ముఖ్యంగా హాట్-రోల్డ్ కాయిల్స్ (HRC), ప్లేట్లు, కోల్డ్-రోల్డ్ కాయిల్స్ మరియు కలర్-కోటెడ్ స్టీల్ వంటి కీలక ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి.
భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా విదేశాల నుండి, ముఖ్యంగా చైనా, వియత్నాం, నేపాల్ ల నుండి భారీగా చౌక స్టీల్ దిగుమతి అవుతోంది. చైనాలో ఆర్థిక మందగమనం వల్ల అక్కడ మిగిలిపోయిన ఉక్కు నిల్వలను తక్కువ ధరకే అంతర్జాతీయ మార్కెట్లకు, ముఖ్యంగా భారత్‌కు తరలిస్తున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (DGTR) జరిపిన విచారణలో, ఈ అసాధారణ దిగుమతుల వల్ల దేశీయ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తేలింది. అందుకే ఈ దేశాల నుండి వచ్చే దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి ఈ సుంకాలను విధించారు. అయితే, అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలకు మరియు స్టెయిన్‌లెస్ స్టీల్, టిన్‌ప్లేట్ వంటి ప్రత్యేక ఉత్పత్తులకు ఈ టారిఫ్‌ల నుండి మినహాయింపు కల్పించారు.
భారత ఉక్కు సంఘం (Indian Steel Association – ISA) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఐఎస్ఏ ప్రెసిడెంట్ మరియు జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రపంచ ఉక్కు మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉంది, సరఫరా ఎక్కువగా ఉంది. చైనా తన మిగులు ఉత్పత్తిని భారత్‌కు మళ్లించడం వల్ల మన దేశీయ పెట్టుబడులు మరియు ఉపాధిపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ పరిశ్రమకు స్థిరత్వాన్ని ఇస్తుంది,” అని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ వార్త వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో ఉక్కు కంపెనీల షేర్లు రాణించాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మరియు సెయిల్ (SAIL) వంటి కంపెనీల షేర్లు గణనీయమైన లాభాలను ఆర్జించాయి.
అయితే, ఇదే సమయంలో ఐరోపా సమాఖ్య (EU) నేటి నుండి (జనవరి 1, 2026) కార్బన్ బార్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (CBAM) ను అమలు చేస్తోంది. దీనివల్ల భారత ఉక్కు ఎగుమతిదారులు యూరప్‌కు ఎగుమతి చేసేటప్పుడు అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుంది లేదా తమ ధరలను 15-22 శాతం తగ్గించుకోవాల్సి వస్తుంది.

