ఇటీవల బంగారం కంటే వెండి (Silver) పెట్టుబడిదారుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో వెండి ధరలు ఏకంగా 120 శాతానికి పైగా పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 70 డాలర్ల మార్కును దాటగా, 2026 నాటికి ఇది ఊహించని స్థాయికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు వచ్చే రెండేళ్లలో వెండి ధరలు ఎందుకు భారీగా పెరగనున్నాయి? నిపుణుల అంచనాలు ఏమిటి? చూద్దాం …
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2.40 లక్షల నుంచి రూ. 2.50 లక్షల మధ్య ఊగిసలాడుతోంది. అయితే, మన దేశానికి చెందిన ప్రముఖ ఆర్థిక విశ్లేషక సంస్థ మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal) అంచనా ప్రకారం, 2026 చివరి నాటికి వెండి ధర దేశీయంగా కిలోకు రూ. 4,00,000 మార్కును తాకే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న ధరతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ అంశంపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకిసంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 2026 నాటికి ఔన్సుకు 200 డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. సాధారణ కరెన్సీల (Fiat Currencies) విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాల వల్ల ప్రజలు వెండి వైపు మొగ్గు చూపుతారని ఆయన పేర్కొన్నారు.
అయితే వెండి ధరలు విపరీతంగా పెరగడానికి మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల సౌర శక్తి (Solar Panels), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), మరియు AI డేటా సెంటర్లలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 116 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వస్తాయని అంచనా. వీటన్నింటికీ వెండి అత్యవసరం. అలాగే, వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. గడిచిన ఐదేళ్లుగా వెండి సరఫరాలో లోటు కనిపిస్తోంది. కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడం, మైనింగ్ ఖర్చులు పెరగడం వల్ల డిమాండ్‌కు తగ్గట్టుగా వెండి దొరకడం లేదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే కాలంలో అత్యంత విలువైన ఆస్తిగా వెండి మారబోతోంది. వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం. అయితే, వెండి ధరల్లో ఒడిదుడుకులు (Volatility) ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. స్వల్పకాలికంగా ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం (Buy on Dips) మంచి వ్యూహం అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

