అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 50% టారిఫ్ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లే కనపడుతోంది. ఒకవైపు వస్త్రాలు, వజ్రాలు, నగల వ్యాపారాలు ట్రంప్ టారిఫ్ తో నష్టపోగా.. మనదేశం నుండి అమెరికాకు రొయ్యలు మొదలైన ఆక్వా ఉత్పత్తులలో అగ్రగామి అయిన ఆంధ్రప్రదేశ్ లోని ఆక్వా పరిశ్రమ ఎగుమతులు ఆగిపోవడంతో సంక్షోభంలో పడింది.
రాష్ట్రంలో సుమారు ౩ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావితం అయ్యింది. ఇప్పటికే మార్కెట్ ధరలు పడిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో దేశంలోనే అగ్రగామి అయిన ఆంధ్రప్రదేశ్ తన ఎగుమతుల్లో 92 శాతం అమెరికాకే పంపుతోంది. గతేడాది దేశం నుండి 7.38 బిలియన్ డాలర్ల (రూ. 60,000 కోట్ల) ఎగుమతులు జరిగాయి. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ రంగం ఎంత ప్రమాదంలో పడిందో!
అమెరికా ఆక్వా దిగుమతుల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది. తరువాతి స్థానాల్లో వియత్నాం, బంగ్లాదేశ్, చైనాలు ఉన్నాయి. భారత్ పై ప్రస్తుత అత్యధిక పన్నుల వసూలు వల్ల ఆ దేశాలు లాభ పడనున్నాయని విశ్లేషకుల అంచనా.
3,500 మదికి ఉపాధి కల్పిస్తున్న కోస్తాకు చెందిన సంధ్యా ఆక్వా అధినేత ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ వ్యాపారం సంక్షోభపుటంచుల్లో ఉందని తెలిపారంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చింది అనేది అర్ధం అవుతోంది.
అయితే అమెరికా టారిఫ్ ల వల్ల నష్టపోయిన పరిశ్రమలను ఆదుకుంటామని ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో రాష్ట్రంలోని కూటమి సర్కార్ వీరికి ఎటువంటి న్యాయం చేస్తుందో వేచిచూడాలి.