వైసీపీ నుంచి తొలి వికెట్ డౌన్ – మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా

Photo of author

Eevela_Team

Share this Article

 

ravela kishore babu
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తన‌ రాజీనామా లేఖ‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తాను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు కట్టుబడి పనిచేశాన‌ని.. 2014లో త‌న‌కు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన టీడీపీ బాస్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తూ కొన్ని కార‌ణాల‌తో టీడీపీలో కొన‌సాగ‌లేక‌పోయినందుకు ఎప్పుడూ బాధ‌ప‌డుతూనే ఉంటాన‌ని తెలిపారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేసేందుకు ఎన్నోసార్లు ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేద‌ని వాపోయారు. ఇక వైఎస్ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరిన‌ట్లు తెలిపారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయ‌న‌ను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.

ఇదిలాఉంటే.. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel