శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటుచేసుకున్న అజయ్ దేవ్ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గర్భిణీపై దాడి చేశాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని నడిరోడ్డుపై హింసిస్తూ ఊరేగించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముత్యాలవాండ్లపల్లిలో టపాసులు కాలుస్తున్న సమయంలో స్థానిక మహిళ సంధ్యారాణి (గర్భిణీ) అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో అజయ్ ఆమెపై దాడి చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విచారణ పేరుతో పోలీసులు అతడిని బహిరంగంగా హింసించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచాలి. కానీ, కదిరి పోలీసులు అతడిని రోడ్డుపై పరేడ్ చేస్తూ, జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
ఇటీవలే డిప్యూటీ సీయం ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ జరగాలని చెప్పారు. అయితే ఇప్పుడు జనసేన కార్యకర్తకే ఈ పరిస్థితి ఎదురుకావడం కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, అజయ్ సోదరి రజిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. కదిరి ఘటనపై తాజాగా అజయ్ సోదరి రజిత ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన అన్నపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. “మా అన్న మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఆయనకు జనసేన అంటే ప్రాణం. అందుకే తన చేతిపై ‘PSPK’ అని టాటూ కూడా వేయించుకున్నాడు. మా అన్నకు వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదు. పాత కక్షలతోనే అతడిని ఈ కేసులో ఇరికించారు” అని రజిత కన్నీటి పర్యంతమయ్యారు.
కేవలం రజిత మాటలే కాకుండా, సోషల్ మీడియాలో అజయ్ దేవ్ జనసేన జెండాతో, పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఉన్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ కూడా అజయ్ తమ పార్టీ కార్యకర్తేనని స్పష్టం చేశారు. అజయ్ గత పదేళ్లుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అటువంటి వ్యక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా ముద్ర వేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

