ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రణరంగంలోకి నిజేపీ కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే టిడిపి, జనసేనలు పొత్తులో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కూడా తుదిదశకు వచ్చింది. ఈ దశలో బిజెపిని కూడా సంతృప్తి పరచేలా సీట్ల పంపకం జరగాలని ఇరు
పార్టీ నేతలు నిర్ణయించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎలాగైనా గద్దె దింపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పొత్తులో పట్టువిడుపులు ఉంటేనే ఇది సాధించగలం అని ఆయన నమ్మారు. దీనికోసం తన పార్టీ కొన్ని సీట్లను వదులుకోడానికైనా సిద్దమయ్యారు. అసలైన ఘన విజయం బిజెపి కూడా ఈ కూటమిలోకి వస్తేనే సిద్ధిస్తుందని కనుక ఎలాగైనా బిజెపిని తమ కూటమిలోకి తీసుకు వస్తాను అని చాలాకాలంగా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కలగన్న రోజు రానే వచ్చింది.
నిజానికి టిడిపితో జత కట్టడం బిజెపి అధిష్టానానికి అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు అని, అధికారంలోనికి వచ్చాక తిరిగి తమపై ఒత్తిడి పెంచుతాడు, జాతీయస్థాయిలో బలపడే అవకాశం ఉంది అని భావించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో లేకపోతేనే తమకు మొత్తం సీట్ల మద్దతు ఉంటుందని, ఒక పార్టీ వైపు మొగ్గుచూపితే మరో పార్టీ వోట్లు కోల్పోవడం ఖాయం అని కూడా వారి భావన.
నిజానికి ఈ ఎన్నికలో జనసేన కూడా టిడిపితో పెట్టుకోవడం ఆ పార్టీకి ఇస్టం లేదు. తెలుగుదేశంతో పొత్తు అంటే తిరిగి ఆ పార్టీని బ్రతికించడమేనని ఆ పార్టీ రాష్ట్రంలో శూన్యం అయిపోయాక తాము జనసేన కలిసి ఒక ప్రత్యామ్నాయంగా అడుగుపెట్టాలి అని భావించారు.
ఇటీవల పరిణామాలు ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తిగా మారిపోయాయి. లోకేష్ వెళ్ళి అమిత్ షా ని కలవడం, చంద్రబాబుకి బెయిల్ వచ్చాక ప్రజల్లో వచ్చిన సానుభూతి చూసిన బిజెపి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయలేమని అంచనాకు వచ్చినట్లుంది. తాము అనుకున్న “ప్రత్యామ్నాయం” ఎత్తుని వైసీపీ పైనే ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని వారు భావించి ఉండవచ్చు. క్రమంగా పుంజుకుంటున్న టిడిపి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది అని వారికి సమాచారం వచ్చి ఉండవచ్చు. టిడిపికి అనుకూలం అయిన రాష్ట్ర నాయకత్వం కూడా అధిష్టానంపై ఒత్తిడి పెంచి ఉండవచ్చు.
అందుకే, తమ ఇప్పటికైనా గౌరవాన్ని నిలుపుకోవాలని బిజెపి హైకమాండ్ తమ పట్టు సడలించినట్లే అనిపిస్తోంది. సీట్ల సర్దుబాటు తుడిదశకు వచ్చిందని మీ సంగతి చెప్పండి అని పవన్ ఫోన్ చేయగానే అవకాశాన్ని చేజారనివ్వవద్దని చంద్రబాబుని ఢిల్లీకి పంపించాలని చెప్పింది.
ఇక ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేదే ఆసక్తిగా ఉంది. కేవలం చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి తాము లేము అని తమ వ్యూహాలు తమకు ఉంటాయి అని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అందుకే కనీసం 5 లోక్ సభ, 15 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేసే ఉద్దేశ్యం అయితే కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజులు ఆగితే ఈ అంశం మొత్తం కొలిక్కి వస్తుంది.
మొత్తానికైతే తాను తెస్తాను అన్న బిజెపిని టిడిపితో కలపడంలో పవన్ సక్సెస్ అయ్యినట్లే భావించాలి. రాబోయే కాలంలో కూటమిలో పవన్ ముఖ్యభూమిక పోషించవచ్చు.. ఆయన మాట నెగ్గవచ్చు.