ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాను విజనరీ అని నిరూపించారు. రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ఏకంగా ₹100 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ‘క్వాంటం టెక్నాలజీ’ రంగంలో పరిశోధనలు చేసి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే శాస్త్రవేత్తలకు ఈ భారీ నజరానా దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి వేదికగా మంగళవారం (డిసెంబర్ 23, 2025) నాడు జరిగిన ‘క్వాంటం టాక్ విత్ సీఎం సీబీఎన్’ కార్యక్రమంలో వేలాది మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ఆయన తన అద్భుతమైన విజన్‌ను పంచుకున్నారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’ (Quantum Valley) గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని టాప్-5 క్వాంటం హబ్‌లలో ఒకటిగా అమరావతిని నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే 80-85 శాతం భాగస్వామ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
గతంలో 2017లో కూడా చంద్రబాబు ఇటువంటి ప్రకటనే చేశారు. అయితే ఇప్పుడు దానిని మరింత స్పష్టంగా, క్వాంటం పరిశోధనలకు జోడించి ప్రకటించారు. అసలు నోబెల్ బహుమతి విలువ కంటే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ ₹100 కోట్ల నజరానా ఎంతో పెద్దది. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పరిశోధనలకు, యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే ఒక గొప్ప ప్రోత్సాహం. “మనం ఎవరినో అనుసరించడం కాదు.. మనం ప్రపంచానికి నాయకత్వం వహించాలి” (First Mover Advantage) అని ఆయన పిలుపునిచ్చారు.

