సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలుగుబంటి వేషంలో ఒక వ్యక్తి కోతులను తరిమికొడుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఆ ఎలుగుబంటి వేషంలో ఉన్నది ఎవరో తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఆయనే తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన ఒక గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్. తన గ్రామంలోని కోతుల సమస్యను తీర్చడానికి ఆయన ఎంచుకున్న ఈ వినూత్న మార్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో గత రెండు మూడు ఏళ్లుగా కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వానర మూకలు ఇళ్లపై పడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, పంట పొలాలను నాశనం చేస్తూ గ్రామస్తులను హడలెత్తిస్తున్నాయి. ఈ సమస్య గ్రామస్తులకు పెను సవాలుగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, కోతుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కుమ్మరి రంజిత్ అనే యువకుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో గెలవగానే రంజిత్ తన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. గతంలో గ్రామస్తులంతా కలిసి ఒక్కో ఇంటి నుంచి 50 రూపాయలు చొప్పున వసూలు చేసి కోతులను పట్టడానికి బోన్లు (Cages) ఏర్పాటు చేశారు. కానీ, ఆ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం కొన్ని కోతులు మాత్రమే చిక్కడంతో సమస్య అలాగే ఉండిపోయింది. పంచాయతీలో నిధుల కొరత ఉండటంతో, ఖరీదైన ‘మంకీ క్యాచర్లను’ పిలిపించడం కష్టమని భావించిన రంజిత్.. ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతికారు.
యూట్యూబ్‌లో ఒక వీడియో చూసిన రంజిత్‌కు ఎలుగుబంటి వేషం వేసి కోతులను భయపెట్టవచ్చనే ఆలోచన వచ్చింది. వెంటనే ఒక ఎలుగుబంటి దుస్తుల సెట్‌ను కొనుగోలు చేసి, తానే స్వయంగా ఆ వేషం ధరించి వీధుల్లోకి వచ్చారు. ఎలుగుబంటిలా అరుస్తూ, ఎగురుతూ కోతులను భయపెట్టడం ప్రారంభించారు.
సర్పంచ్ రంజిత్ ఎలుగుబంటి వేషంలో గ్రామ వీధుల్లో పహారా కాస్తుంటే, ఆ భయానికి కోతులు గ్రామం విడిచి పారిపోతున్నాయి. ఈ వినూత్న ప్రయోగం తాత్కాలికంగానైనా గ్రామస్తులకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
“నేను గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం కోతుల సమస్యను పరిష్కరించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. స్వయంగా నేనే వేషం వేయడం వల్ల కోతులు భయపడి దూరంగా వెళ్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి మరికొన్ని దుస్తులు తెప్పించి కోతులు రాకుండా పహారా పెంచుతాము” అని రంజిత్ పేర్కొన్నారు.
సర్పంచ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉందని, పంట నష్టం భారీగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో కోతుల నియంత్రణకు ఒక శాశ్వత ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన కోరారు.

