టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడటం, అతని స్థానంలో డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) తిరిగి జట్టులోకి రావడం. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7, 2026 నుండి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈసారి ఎంపికలో ఫామ్‌కే పెద్దపీట వేసింది.
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా, మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్‌ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. గత 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో గిల్ కేవలం 291 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. అతని స్ట్రైక్ రేట్ కూడా 137.26 వద్దే ఉండిపోయింది.దీనితో పాటూ, ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో గిల్ పాదానికి గాయమైంది. దీనివల్ల అతను కీలకమైన మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఫిట్‌నెస్, ఫామ్ రెండూ అనుకూలించకపోవడంతో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.
ఇషాన్ కిషన్ ‘మాస్’ రీ-ఎంట్రీ
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి జాతీయ జట్టులోకి రావడం ఈ ఎంపికలో హైలైట్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 లో జార్ఖండ్ జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్, ఆ జట్టును విజేతగా నిలపడమే కాకుండా 500 పైగా పరుగులతో వీరవిహారం చేశారు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ 200 సమీపంలో ఉండటం సెలెక్టర్లను ఆకర్షించింది. గిల్ స్థానంలో ఓపెనర్‌గా మరియు వికెట్ కీపింగ్ బ్యాకప్‌గా ఇషాన్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.
వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. జైస్వాల్‌కు నిరాశే
గిల్ జట్టులో లేకపోవడంతో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. జట్టులో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అక్షర్, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కు చేదోడు వాదోడుగా నిలవనున్నారు. మరోవైపు, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌ను కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అతని స్థానంలో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ కు అవకాశం కల్పించారు.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఆల్ రౌండర్లతో సమతుల్యంగా కనిపిస్తోంది.
- బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్.
- వికెట్ కీపర్లు: సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్.
- ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్.
- బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఈ ఎంపికను బట్టి చూస్తుంటే, టీమ్ మేనేజ్‌మెంట్ “స్టార్ పవర్” కంటే “ప్రస్తుత ఫామ్”, “స్ట్రైక్ రేట్” కే ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌లో విధ్వంసం సృష్టించే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఉండటం పవర్ ప్లేలో భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఫినిషర్‌గా రింకూ సింగ్ తిరిగి రావడం మిడిల్ ఆర్డర్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మరి ఈ కొత్త జట్టుతో భారత్ తమ టైటిల్‌ను కాపాడుకుంటుందో లేదో వేచి చూడాలి!

